పురపోరు కీలక ఘట్టానికి చేరుకుంది. హోరెత్తిన ప్రచార పర్వం ముగిసింది. విజయమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. డప్పుచప్పుళ్లు, మైకుల మోతలతో దద్దరిల్లిన పుర వీధులు ప్రశాతంగా మారాయి. ప్రచార ముగింపు నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టే సమయాన్ని ఎంతో విలువైందిగా భావించే నేతలు వారి రాజకీయ చతురతకు పనిచెప్తున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు తమ అనుభవాన్ని రంగరించి సొమ్ము చేసుకునే పనిలో తలమునలయ్యారు.
చెవిలో ప్రచారాలు...
బహిరంగ ప్రచారానికి సమయం ముగియటం వల్ల ప్రత్యామ్నయ ప్రచారం వైపు దృష్టి సారిస్తున్నారు కొందరు అభ్యర్థులు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో ముందే రికార్డు చేసిన వాయిస్ సందేశాలు, ఎస్ఎంఎస్లును చరవాణులకు పంపడమే కాకుండా... కార్యకర్తలతో ఫోన్లు చేపిస్తూ... తమను మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక్క ఓటూ జారిపోకుండా...
ఓ పక్క ఓటు అమ్ముకోవద్దని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చైతన్యపరుస్తూంటే... తాయిలాలతో తమవైపు తిప్పుకునేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. గుట్టుగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. గల్లీల్లో పోలీసులు నిఘా పెట్టినా... ప్రలోభాలను కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పటికే పలు చోట్ల డబ్బులు పంచుతూ పలువురు నేతలు అధికారులకు పట్టుబడ్డారు. అభ్యర్థులు తమ వార్డులో ఓటర్లకు విలువైన బహుమతులు పంపిస్తూ... చేజారిపోకుండా చూసుకుంటున్నారు. ఉద్యోగరిత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న వార్డుల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... అన్నిరకాలుగా హామీలిస్తున్నారు. పోలింగ్ రోజు ఓట్లు వేసి పోయేలా... ప్రయాణ ఛార్జీల దగ్గరి నుంచి నీళ్ల ప్యాకెట్ల వరకు అన్ని ఖర్చులు భరిస్తామని వేడుకుంటున్నారు.
గెలవటమే లక్ష్యం...
ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల అధికారుల కళ్లుగప్పి విడతల వారిగా మద్యం, డబ్బుల వితరణ జరుగుతూనే ఉంది. గెలవడమే లక్ష్యంగా... ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న అభ్యర్థులు ఖర్చులకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఏ రకంగానైనా ప్రజలను ప్రలోభపెట్టి... ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు, కార్యకర్తలు శతవిధాల శ్రమిస్తున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: పోలింగ్‌కి ముందు.. పంచిపెట్టారు..