పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లలో కొంత మందిపై కేసులున్నట్లు పోలీస్ నియామక మండలి గుర్తించింది. ఈ వారంలో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం కానున్న తరుణంలో.. కేసులున్న వారిపై ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగత నడవడికపై.. పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో విచారణ చేయించారు. మొత్తం అభ్యర్థల్లో సుమారు 300 మందిపైన కేసులున్నట్లు తేలింది.
కేసులున్న విషయం దాచిపెట్టారు
కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తమపై ఉన్న కేసులను అభ్యర్థులు తెలపాల్సి ఉంటుంది. కానీ కొంతమంది కేసుల విషయం దాచిపెట్టారు. విచారణలో వారిపై కేసులున్నట్లు బయటపడింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాష్ట్ర పోలీస్ నియామక మండలి 2018 మే 31న నోటిఫికేషన్ జారీ చేసింది. 16 వేల 925 ఉద్యోగాల్లో సివిల్, ఏఆర్, ప్రత్యేక పోలీసు పోస్టులతో పాటు అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక భద్రతా విభాగంలోనూ కొన్ని పోస్టులు ఉన్నాయి.
16,025 మంది ఎంపిక
కొలువులకు దాదాపు 5 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మొదట వీరికి 2018 సెప్టెంబర్లో ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించారు. అందులో 2లక్షల 28వేల మందికి పైగా అర్హత సాధించారు. వారికి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వాళ్లకు ప్రధాన పరీక్ష నిర్వహించారు. నాలుగు నెలల క్రితం ప్రకటించిన జాబితాలో 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన వారి ధ్రువపత్రాలు, మెడికల్ సర్టిఫికెట్లు పరిశీలించారు. అన్ని సక్రమంగా ఉన్న వారిని ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించారు.
అనుమతిచ్చాలా..? వద్దా..?
ఎంపికైన వారిలో కొంత మందిపై కేసులుండడం వల్ల వారిని శిక్షణకు అనుమతిచ్చాలా..? వద్దా..? అనే విషయంపై పోలీస్ నియామక మండలి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపికైనా ఎలాంటి సమాచారం లేదని కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కేసులతో పాటు... ధ్రువపత్రాలు, మెడికల్ సర్టిఫికెట్లు సరిగ్గా సమర్పించకపోవడం వల్లే కొంత మంది అభ్యర్థులకు సమాచారం వెళ్లలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గద్వాల సంస్థానంలో పుర సమరం