Cardiac Arrests Increases Now A Days: కార్డియాక్ అరెస్ట్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించే పదం. ఒకప్పుడు వృద్ధాప్యం, ఇతర వ్యాధులున్న వారికి వచ్చేది. ఇప్పుడు యువత నుంచి మధ్య వయస్కుల వారిని.. అనేక మందిని బలిగొంటుంది. వయసు ఏదైనా.. శారీరకంగా ఎంత ఫిట్ గా ఉన్నా.. దీని బారిన పడి చనిపోతున్న వారెందరో.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌పుత్ 2021 అక్డోబర్ 29న ఉదయం తన స్వగృహంలో వ్యాయామం చేస్తూ కార్డియాక్ అరెస్ట్ తో అస్వస్థతకు గురయ్యారు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 46 ఏళ్లు. ఏపీ మాజీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (51) కూడా ఇలానే కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న సైతం ఇలానే మరణించారు. వీరందరూ శారీరకంగా ఎంతో ఫిట్ గా ఉండే వాళ్లు.
అసలేంటి ఈ కార్డియాక్ అరెస్ట్..? : గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నళ్లతో తలెత్తిన లోపం కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా ఆగిపోవడంతో అది కార్డియాక్ అరెస్టుగా మారుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపేయగానే మెదడులో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దాంతో ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది. ఇది వచ్చే ముందు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. కాబట్టి ఇది సంభవిస్తే ఆప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి.
హార్ట్ ఎటాక్‌కి దీనికి తేడా ఏంటి ?: చాలా మంది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ కాదు. ఇవి రెండూ గుండెకు సంబంధించిన వ్యాధులే. అయితే రెండింటి మధ్య తేడా ఉంటుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి గుండో పోటు వస్తుంది. గుండె వ్యవస్థలో లోపం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. తీవ్రమైన ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం వంటివి జరిగి చివరికి గుండె కొట్టుకోవడం ఆకస్మత్తుగా ఆగిపోతుంది. ఈ సమయంలో సీపీఆర్ చేస్తే బాధితులు బతికే అవకాశం ఉంటుంది.
ప్రాణాలు నిలబెట్టే సీపీఆర్..: విపత్కర పరిస్థితుల్లో కంగారు పడకుండా కాస్త వివేచనతో ఆలోచిస్తే మన వారిని కాపాడుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో సీపీఆర్ అనే పద్ధతి ద్వారా ఆగిపోతున్న గుండెను పనిచేసేలా చేయొచ్చు. ఈ ప్రక్రియను ఎలా చేయాలంటే... బాధితుల్ని సమాంతరంగా ఉన్న నేలపై పడుకోవబెట్టి వారి తలని కొంచెం పైకి పట్టుకోవాలి. తర్వాత నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు రెండు చేతుల్ని ఉపయోగించి నొక్కుతూ ఉండాలి. అనంతరం మళ్లీ ఒకసారి కృత్రిమ శ్వాస అందించాలి. ఇలా చేయడం వల్ల వారు బతికే అవకాశముంటుంది.
ఇవీ చదవండి: