గులాబ్ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటి గమ్యాలు కుదించడం, మరి కొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఇవాళ విశాఖ, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు.., విశాఖ, విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేశారన్నారు. ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్ నుంచి బయలు దేరుతుందన్నారు. పలు సాంకేతిక కారణల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.
మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Gulab Cyclone in Telangana : తెలంగాణలోనూ 'గులాబ్' గుబులు.. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు!