తెలంగాణలో ఐటీరంగ అభివృద్ధిపై కెనడాలోని పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఉన్నాయని ఆ దేశంలోని అల్బెర్టా ఫ్రావిన్స్‌కు చెందిన మౌలికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా తెలిపారు. రాష్ట్రంలోని విధానాలు, అవకాశాలు వివరించేందుకు త్వరలోనే కెనడాలో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.
కేటీఆర్‌తో సమావేశం:
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రసాద్ పండా ఇవాళ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అల్బెర్టా ఫ్రావిన్సు, తెలంగాణ మధ్య వ్యాపార, వాణిజ్య అవకాశాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధి గురించి చాలా సానుకూలంగా ఉందన్న ఆయన... అల్బెర్టా ప్రావిన్స్‌లోని పారిశ్రామిక వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని తెలిపారు.
కెనడా పెట్టుబడులు
కెనడా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలున్నాయని... తెలంగాణ పారిశ్రామిక విధానాలు, అవకాశాల గురించి తెలిపేందుకు తమ దేశంలో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్కడున్న సహజవనరులు, భారత్‌లోని మానవవనరుల కలయికతో మరిన్ని వ్యాపార అవకాశాలు ఏర్పడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అల్బెర్టా ఫ్రావిన్స్ ప్రీమియర్ జేసన్ కెన్నీని రాష్ట్రంలో పర్యటించాలని కోరామని... వచ్చే ఏడాది ఆయన ఇక్కడకు వస్తారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను అల్బెర్టాలో ఘనంగా నిర్వహిస్తామని ప్రసాద్ పండా చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి విజయవంతమైన కేసీఆర్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. టీఎస్ఐపాస్ సహా రాష్ట్ర విధానాల ద్వారా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను తెలంగాణకు రప్పించిన తీరును మంత్రి కేటీఆర్... కెనడా మంత్రికి వివరించారు.
- ఇదీ చూడండి: రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్