రాష్ట్ర కాంగ్రెస్ సారథి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అన్ని ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పురపాలక ఎన్నికల అనంతరం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడమే కాకుండా అధిష్ఠానానికి స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
రెండు వారాల్లో కొలిక్కి
శాసనసభ ఎన్నికల అనంతరమే కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చర్చ జరిగినా రాష్ట్రంలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం వాయిదా పడుతూ వచ్చింది. రెండు వారాల్లో కొలిక్కి తేవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలేమీ లేకపోవడం వల్ల పార్టీని బలోపేతం చేసేందుకు అనుకూలమైన సమయమని ముఖ్యనేతలు భావిస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా నియామకం ఉంటుందని పేర్కొంటున్నారు.
అధ్యక్ష పీఠంపై ముఖ్యనేతల ఆసక్తి
ఆంధ్రప్రదేశ్‌లో అధిష్ఠానం కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ పీసీసీపై ఏఐసీసీ ముఖ్యులు దృష్టి సారించారు. ఇక్కడ వ్యవహారాలపై అవగాహన ఉన్న ఏఐసీసీ ముఖ్యులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు సమాచారం. అధ్యక్ష పీఠంపై పలువురు ముఖ్యనేతలు ఆసక్తితో ఉన్నారు. అధిష్ఠానం పెద్దల్ని కలిసి.. పగ్గాలు అప్పగిస్తే పార్టీని సమర్థంగా ముందుకు తీసుకెళ్తామని వివరించారు.
అంతా కీలక నేతలే
సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలిచారు. వివిధ సమీకరణల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు బాధ్యతలు అప్పగించే అంశం చర్చల్లో ఉంది. ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఆసక్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జి.చిన్నారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహా మరికొందరి పేర్లు చర్చల్లో ఉన్నాయి. పార్టీని సమర్థంగా నడిపే నేతనే నియమించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: శంభో.. శివ.. శంభో..