2019 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న 79 ప్రభుత్వ కంపెనీలు, మూడు శాసన బద్ధ సంస్థలు కలుపుకొని 82 ప్రభుత్వ రంగ సంస్థలపై 20018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ రంగానికి చెందినవి కాగా... మిగతావి విద్యుతేతర ప్రభుత్వ రంగ సంస్థలని తెలిపింది. 2018-19లో కొత్తగా ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి.
విద్యుత్ రంగంలో 29,263.92 కోట్ల పెట్టుబడి
2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి 84,259.06 కోట్లు టర్నోవర్ నమోదు చేయగా.. ఇది తెలంగాణ రాష్ట్ర స్థూల గృహోత్పత్తిలో 9.79 శాతానికి సమానమని పేర్కొంది. 2019 మార్చి 31 నాటికి 82 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలల్లో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, ఇతరుల పెట్టుబడి మొత్తం 1,33,055.89 కోట్లుగా తెలిపింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణాలు, సబ్సిడీ, గ్రాంట్ల కింద 52,219. 41 కోట్ల పెట్టుబడి పెట్టగా... ప్రధానంగా విద్యుత్ రంగంలో 29,263.92 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వివరించింది.
స్వల్ప నష్టాల్లో టీఎస్ఆర్ఈడీసీఎల్, ఏపీటీపీసీఎల్
విద్యుత్ రంగ సంస్థల పనితీరుపై అధ్యయనం చేసిన కాగ్... 2014 నుంచి 2019 మధ్య నష్టాలు పెరిగినట్లు తెలిపింది. 2018-19లో విద్యుత్ పీఎస్యూలు మొత్తం టర్నోవర్ 66,979.90 కోట్లుగా ఉండగా... ఇది తెలంగాణ జీఎస్డీపీలో 7.78 శాతానికి సమానమని పేర్కొంది. ఈ 8 పీఎస్యూలు 2014-15లో 1,907.03 కోట్ల నష్టాలతో ఉండగా.. 2018-19లో నష్టాలు 5,433 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. సింగరేణి కాలరీస్, జెన్ కో, ట్రాన్స్ కో సంస్థలు 5,287.60 కోట్ల లాభాలను ఆర్జించినట్లు కాగ్ వెల్లడించింది. టీఎస్ఎస్పీడీఎల్, ఎన్పీడీసీఎల్... ఈ రెండు సంస్థలు 8,018.70 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు పేర్కొంది. టీఎస్ఆర్ఈడీసీఎల్, ఏపీటీపీసీఎల్ 2.44 కోట్ల స్వల్ప నష్టాన్ని చవిచూడగా... టీపీఎఫ్సీఎల్ లాభానష్టాలు లేకుండా కొనసాగుతోంది.
రూ. 28,426.43 కోట్ల నష్టం
2014-19 మధ్య విద్యుత్ రంగ పీఎస్యూలలో పెట్టుబడిపై వాస్తవ రాబడి రేటు ప్రతికూలంగా... 10.23 శాతం నుంచి 17.64 శాతం మధ్యలో ఉన్నట్లు వెల్లడించింది. ఇదే ఐదు సంవత్సరాల్లో డిస్కంల భారీ నష్టాలు చవిచూడటం వల్లే విద్యుత్ రంగ సంస్థల మొత్తంగా నష్టాలను చవిచూశాయని అభిప్రాయపడింది. విద్యుత్ రంగ పీఎస్యూలలో మూలధన పెట్టుబడి 17,770.46 కోట్లని, పేరుకుపోయిన నష్టాలు 28,426.43 కోట్లని.. వాటి నికర విలువ రూ. 10,655.97 కోట్ల బుణాత్మకంగా ఉన్నట్లు పేర్కొంది. టీఎస్ ట్రాన్స్ కో 2016 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు బట్వాడా విధానమునకు కట్టుబడకపోవటం వల్ల రాష్ట్ర డిస్కంలు 44.67 కోట్లు నివారించదగిన అదనపు వ్యయం వచ్చిందని పేర్కొంది కాగ్.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 928.66 కోట్ల నష్టాలు
74 విద్యుతేతర ప్రభుత్వ రంగ సంస్థల్లో 20 నిష్క్రియంగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. మిగిలిన 54 పీఎస్యూలలో 51 ప్రభుత్వ కంపెనీలు 3 శాసన బద్ధ సంస్థలున్నాయి. 2018-19 సంవత్సరంలో వీటి మొత్తం టర్నోవర్ 17,279.16 కోట్లు కాగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి 29,083.42 కోట్లు ఉన్నట్లు తెలిపింది. క్రియాశీలకంగా ఉన్న ఈ 54 పీఎస్‌యూలకు 2014-19 మధ్యలో 4,238.79 కోట్ల నష్టాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 57.39 కోట్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 47.36 కోట్లు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ 22.54 కోట్లు, రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ 12.43 కోట్లు లెక్కల లాభాలను ఆర్జించగా... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రణాళిక లోపించి 928.66 కోట్ల నష్టాలను నమోదు చేసినట్లు కాగ్ పరిశీలనలో వెల్లడైంది.
అవసరం లేకున్నా అప్పు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, తెలంగాణ తాగు నీటి సరఫరా సంస్థలు భారీ నష్టాలను నమోదు చేశాయి. మొత్తం పీఎస్‌యూల సమగ్ర నష్టాల్లో ప్రధాన వాటా వీటిదే ఉంది. కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు సంస్థ తక్షణ అవసరం లేకున్నా రూ. 539.56 కోట్ల అధిక రుణం తీసుకోవటం వల్ల రూ. 8.51 కోట్ల వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ... నిబంధనల ఉల్లఘించి తక్కువ ధరకే ఓ ప్రైవేటు సంస్థకు భూమి విక్రయించటం వల్ల 4.47 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయన్ని వాస్తవికంగా అంచనా వేయకపోవటం, పన్ను రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేయటం కారణంగా... ముందస్తు పన్ను చెల్లించటంలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు విఫలమైనందున... 20.34 కోట్ల జరిమానాలు, వడ్డీ చెల్లించాల్సి వచ్చినట్లు కాగ్ వెల్లడించింది.
ఇదీ చదవండి: అనవసరమైన పనులు చేసి డబ్బులు వృథా చేశారు: కాగ్