2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన నివేదికలో భాగంగా సామాన్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో కొన్ని పరిశీలనలను వెల్లడించింది. జైళ్ల శాఖలో 30 శాతం ఖాళీలు ఉన్నాయని.. ఇది జైలు పరిపాలన, నిర్వహణ విషయంలో మానవ వనరుల లేమిని సూచిస్తోందని పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి కోసం ఖైదీలకు పారిశ్రామిక శిక్షణ, ఉపాధి అవకాశాలు లేవని కాగ్ వెల్లడించింది. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యా విధానంలో అనర్హులైన వారికి 1 కోటి 90 లక్షలు ఉపకార వేతనాలుగా అందాయని కాగ్ గుర్తించింది.
ఈహెచ్ఎంఎస్ ప్రాజెక్ట్ సరిగా అమలు కావడం లేదు
ఎలక్ట్రానిక్ వైద్య డేటా నిర్వహణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం-ఈహెచ్ఎంఎస్ ప్రాజెక్ట్ సరిగా అమలు కావడం లేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 31.69 లక్షలు ప్రజాపన్నుల శాఖలో ఉన్నాయని గుర్తించింది. ఇదే ఖాతా నుంచి గుత్తేదారుకు 22.88 కోట్లు విడుదల చేసి లబ్ధి కలిగించారని కాగ్ నిర్ధరించింది. గ్రేటర్ వరంగల్‌తో పాటు మరో నాలుగు పురపాలికల్లో ఖాళీ స్థలాల ఆస్తి పన్ను మదింపు, వసూలు చేయకపోవడం వల్ల ఆదాయం కోల్పోయాయని కాగ్ ప్రస్తావించింది.
2.85 కోట్లు వృథా
సిరిసిల్ల పురపాలికకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నా.. 13 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 2.85 కోట్లతో లోయర్ మానేర్ డ్యాం నుంచి వృథాగా పంపింగ్ స్టేషన్ నిర్మించారని కాగ్ తప్పుపట్టింది. సంగారెడ్డి పురపాలికలో 1 కోటి 9 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ఆరేళ్లైనా పూర్తి కాలేదని పేర్కొంది. 72.33 లక్షల వ్యయం చేసినా.. ఫలితాలు ఇంకా అందలేదని పేర్కొంది.
కాంట్రాక్టర్ తప్పు చేస్తే హెచ్ఎండబ్ల్యూఎస్ డబ్బులు చెల్లించింది
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 3.65 కోట్ల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్ అద్దె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల వల్ల స్పందన లేదని కాగ్ వివరించింది. హెచ్ఎండీఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హ్యాబిటేట్ సెంటర్ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల.. 62.50 లక్షల వ్యయం నిరూపయోగమైందని తెలిపింది. కూకట్‌పల్లి నాలా మళ్లింపు కోసం కాంట్రాక్టర్ 132 కెవి భూగర్భ కేబుల్ డ్యామేజీ చేస్తే రిపేర్ ఖర్చులు.. హెచ్ఎండబ్ల్యూఎస్ చెల్లించిందని కాగ్ తప్పుపట్టింది. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయలేదని వివరించింది. ములుగు జిల్లాల్లో 2014-15 మధ్య చేపట్టిన పంచాయతీ రాజ్ రోడ్లకు అనుమతులు పొందకపోవటం పనులు మధ్యలో నిలిచిపోయాయని కాగ్ వెల్లడించింది
ఇదీ చదవండి: ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ విధించం: సీఎం కేసీఆర్