రేపు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో ప్రధానంగా కొత్త పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లుపై చర్చిస్తారు. నూతన చట్టం తీసుకొచ్చేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. పురపాలక శాఖ సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. నూతన చట్టం ఉద్దేశం, లక్ష్యాలను.. మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివిధ ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
పుర ఎన్నికలపై చర్చ..
నూతన పురపాలక చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు జరగనున్నాయి. పురపాలక ఎన్నికలకు సంబంధించి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే భూమి పూజ చేసిన నేపథ్యంలో నూతన సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ప్రస్తుత సచివాలయ తరలింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం సహా ఇతర పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
చర్చకు రానున్న పలు అంశాలు..
జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల మొదటి సమావేశ తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. జీఎస్టీకి సంబంధించి కూడా రెండు చట్ట సవరణలు చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. భాషా పండితులు- పీఈటీలకు పదోన్నతులు, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కొత్త పోస్టులు, వివిధ న్యాయస్థాల్లో కొత్త పోస్టులను మంజూరు చేస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
ఇవీ చూడండి: గ్యాంగ్‌స్టర్ నయీం తల్లి అరెస్టు