Cabinet Meeting on September Third: సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
మరోవైపు ఈనెల 31న బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చేయనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. కేసీఆర్ ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా బయలుదేరి వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థికసాయం అందించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు.
ఇవీ చదవండి: భాజపా ముక్త్ భారత్ కోసం సన్నద్ధం కావాలని కేసీఆర్ పిలుపు