కరోనా మూడో వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, ఔషధాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆసుపత్రుల నిర్మించాలని తీర్మానించారు. సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. బుధవారం ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ సూచించింది.
ప్రత్యేక భవనాల్లో మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వారిని ఇతర రోగులతో కలపకుండా తల్లీ, బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని.. అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన ఆసుపత్రిలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హై రిస్క్ ప్రసవాలవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐ సీ యూ’ లను , నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూలను ఏర్పాటు చేయాలని.. వైద్యారోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేయాలని తీర్మానించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచే గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్‌ను అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.