రాష్ట్రంలో రైతులు ఈ సీజన్‌లో మొత్తం కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేశారు. వీటిలో వరి 52.55 లక్షలు, పత్తి 60.22 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ రెండు పంటల కోతలు ఇప్పటికే అక్కడక్కడ మొదలయ్యాయి. కూలీల కొరత అధికంగా ఉన్నందున కోతలకు యంత్రాలే వినియోగిస్తామని రైతులు పేర్కొంటున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. హార్వెస్టర్ యంత్రంతో వరిని కోస్తే 2, 3 గంటల్లోనే కోత పూర్తవుతుంది.
ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్ ట్రాలీలో అదే పోస్తుంది. పొలం నుంచే ధాన్యాన్ని నేరుగా అమ్మకానికి తీసుకెళ్లవచ్చు. గతేడాది ఎకరా వరి కోతకు హార్వెస్టర్‌కు రూ.1,800 నుంచి రూ.2,200 దాకా అద్దె తీసుకున్నారు. డీజిల్ రేట్లు పెరిగినందున ఈసారి ఎకరానికి రూ.2,200 నుంచి రూ.2,500 దాకా వసూలు చేయాలని హార్వెస్టర్ల యజమానులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలో హార్వెస్టర్ యజమానులు సిండికేట్‌గా మారి రైౖతుల వద్ద ఒకే ధర వసూలు చేయాలని ముందే తీర్మానించుకున్నట్లు తెలిసింది.
గ్రామాల వారీగా ఎన్ని వరికోత యంత్రాలు(హార్వెస్టర్లు) ఉన్నాయి, ధాన్యం తరలించడానికి ఎన్ని ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరికోత యంత్రాలు 15,243, ట్రాక్టర్లు 2.39 లక్షలున్నట్లు ఈ శాఖ అధ్యయనంలో తేలింది. వీటిలో లక్షా 60 వేల ట్రాక్టర్లను కేవలం వ్యవసాయ పనులకే వినియోగిస్తున్నట్లు వాటి యజమానులు చెప్పారు. ఎకరానికి సగటున రూ.2,500 చొప్పున చెల్లించినా, ధాన్యాన్ని ట్రాక్టర్‌తో మార్కెట్‌కు తరలించే ఖర్చుతో కలిపి మొత్తం 52.55 లక్షల ఎకరాలకు రూ.1,500 కోట్ల వరకూ రైతులు 2 నెలల్లోగా ఖర్చుపెట్టాలి.
పత్తి చేలలో దూదిని తీయడానికి రాష్ట్రంలో యంత్రాలు పెద్దగా లేవు. కూలీలతోనే చేయించాల్సి ఉన్నందున పత్తి కోతలకు రూ.2 వేల కోట్ల వరకూ రైతులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో కూలీలు కిలో దూది తీయడానికి రూ.8 నుంచి రూ.10 అడుగుతున్నారు.
ఇలా వరి, పత్తి పంటల కోతలకే రాష్ట్రంలో రూ.3500 కోట్లకు పైగా రైతులు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి కోతలకు పుష్కలంగా యంత్రాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 23,365 కొత్త ట్రాక్టర్లు, మరో 1148 వరికోత యంత్రాలను రాష్ట్రంలో విక్రయించినట్లు గుర్తించామన్నారు. వీటితో కలిపి మొత్తం 15,243 వరికోత యంత్రాలున్నందున కోతలకు ఎలాంటి ఇబ్బందులుండవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం