విపరీతంగా పెరిగిపోతున్న ఉక్కు, సిమెంట్ ధరలను తగ్గించాలంటూ బిల్డర్స్ అసోషియేషన్ ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. కంపెనీలు ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని బిల్డర్స్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని న్యాక్ బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
జీఎస్టీ తగ్గించాలి: బిల్డర్స్
ధరల పెరుగుదలతో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఛైర్మన్ వి.భాస్కర్ రెడ్డి అన్నారు. సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరారు. అదేవిధంగా ధరల నియంత్రణ కోసం రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. పెరిగిపోతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటిని నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ధరల తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని బిల్డర్స్ అసోషియషన్ సభ్యులు డీవీఎన్ రెడ్డి కోరారు.