రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు... సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఒక లక్షా 82 వేలా 17 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం... ఆర్నెళ్ల ఖర్చుకు ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకొంది. ఓటాన్ అకౌంట్ స్థానంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థికశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి.
ముఖ్యమంత్రి సమీక్ష...
బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులపై సీఎం విస్తృతంగా చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తగ్గుదల ఉందని... పన్నుల వాటా కూడా తక్కువగా వస్తోందని వివరించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఓటాన్ అకౌంట్ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కాస్తా అటూ ఇటుగా బడ్జెట్ గణాంకాలు ఉంటాయని అంచనా. సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదలకు యథావిధిగా కేటాయింపుల్లో ప్రాధాన్యం కొనసాగనుంది.
త్వరలోనే బడ్జెట్ తేదీల ఖరారు...
వచ్చే నెలాఖరు వరకు గడువున్నప్పటికీ... ప్రథమార్థంలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురపాలక ఎన్నికలు, గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యం హైకోర్టులో ఈనెల 28న విచారణకు రానుంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు కోర్టు అనుమతిస్తే వచ్చే నెల మూడు లేదా నాలుగో వారంలో పురపోరు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకే.... బడ్జెట్ సమావేశాలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చేనెల రెండో తేదీన వినాయక చవితి, 2న నిమజ్జనం ఉంది. భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. త్వరలోనే బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.