Telangana Budget: మెట్రోరైలు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా రూ.2377 కోట్లు ప్రతిపాదించారు. గత పదేళ్లలో చూస్తే మెట్రోకి ఇంత పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్‌లో ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పూర్తయిన మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కావడంతో ప్రభుత్వ నిధులను కేవలం ఆస్తుల సేకరణకు మాత్రమే వినియోగించారు. దీంతో ఏటా రూ.200 నుంచి రూ.500 కోట్ల మాత్రమే కేటాయించేవారు. క్రితం బడ్జెట్‌లో గరిష్ఠంగా వెయ్యికోట్లను ప్రతిపాదించినా.. రూ.200కోట్లు మించి మంజూరు చేయలేదు. కానీ 2021-22 బడ్జెట్‌లో సవరించిన అంచనాలను మాత్రం వెయ్యికోట్లుగా చూపించారు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. పాతబస్తీ మెట్రోకి రూ.500 కోట్లుగా అని ప్రకటించారు. ఇక విమానాశ్రయ మెట్రోకి రూ.377 కోట్లును ప్రతిపాదించారు.
ప్రకటించిన ప్రభుత్వం
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5కి.మీ. మెట్రో మార్గాన్ని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. ఈ ప్రాజెక్టును చేపట్టడంలో వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలతో అవాంతరాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఇవి పరిష్కారమయ్యే సమయానికి కొవిడ్ ప్రభావంతో మెట్రో నష్టాల బారిన పడిందని ఆర్థిక మంత్రి శాసనసభలో తెలిపారు. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ(కన్సెషనర్)తో సంప్రదించి ఈ మార్గంలో మెట్రోరైలు నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రోకోసం రూ.500 కోట్లు ప్రతిపాదించారు. ఈ మార్గం పూర్తికి దాదాపు రూ.2వేల కోట్లు అవుతుందని అంచనా.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రాయనికి ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్ మెట్రోకి బడ్జెట్ పద్దుల్లో రూ.377.35 కోట్లుగా చూపించారు. వాస్తవానికి 31 కి.మీ.ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి రూ. 5వేల కోట్లు అవుతుందని అంచనా. ఇందులో 10 శాతం రూ.500 కోట్లు వ్యయం చేసేందుకు శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపు ముందుకొచ్చింది.
తీవ్ర నష్టాల్లో నడుస్తున్న మెట్రో రైలు
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైలు కొవిడ్‌తో తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇప్పటికే నస్టాలు రూ.2వేల కోట్లను దాటాయి. మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ సాఫ్ట్‌లోన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రభుత్వం సైతం ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఏవిధంగా తోడ్పాటు అందించాలనేదానిపై ఉన్నతాధికారుల కమిటీ వేసింది. 2022-23 బడ్జెట్ చూస్తే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లను ప్రతిపాదించారు. దీంతో ఎల్‌అండ్ టీ మెట్రోని ఆదుకునేందుకు అనే ప్రచారం ఉంది.
ఇదీ చదవండి: