rs praveen kumar comments on brs: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్1 పరీక్షలో మొదటి ర్యాంక్ ఎవరో చెపితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విద్యార్థి నిరుద్యోగ భరోసా సభకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు.
మౌనం అంగీకారమా: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్‌పీఎస్సీలో సభ్యులుగా ఉన్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పదో తరగతి పేపర్ లీక్ విషయంలో 24గంటల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...గ్రూప్1 పేపర్ లీకేజీ అయ్యి 30రోజులవుతున్న అసలు సూత్రధారులను నిందితులను ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీ వెనక పెద్ద తలకాయ ఉందని...వారిని వదిలిపెట్టి చిన్నవాళ్లను అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీతో 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళితే సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం మౌనం అంగీకారమా అంటూ ప్రశ్నించారు.
మామూలు కుంభకోణం కాదు: పేపర్ లీకేజీ కుంభకోణం మామూలు కుంభకోణం కాదు. తెలంగాణలో ఇంటి దొంగలే ఈరోజు సూత్రధారులయ్యారని విమర్శించారు. ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని రాత్రికి రాత్రే పదవి విరమణ చేయించి.. హుటాహుటిన ఆయనను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆఫీసుకు పంపించారని చెప్పుకొచ్చారు. ప్రొఫెసర్ రామలింగారెడ్డి, కామారెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా పనిచేసిన సుమిత్ర, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సత్యనారాయణ, ఎప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టే తిరుగుతూ.. సీఎంతో కలిసి కూర్చుని పైరవీలు చేసే రవీందర్ రెడ్డి వీళ్లందరూ కూడా ముఖ్యమంత్రికి బాగా తెలిసిన వాళ్లే అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
"వేలాది మంది నిరుద్యోగ బిడ్డలతో బహుజన సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సదస్సు నిర్వహించడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగ బిడ్డల వల్ల తెలంగాణ వచ్చిందో వారి ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం పదిలక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకుంటుంది. ఈ కుంభకోణం బయటపడింది. మరి ఆ కుంభకోణంలో విచారణ చాలా నత్తనడకన జరుగుతుంది. నిందితులను బాధితులుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసులో 48గంటల్లో పాత్రదారులు, సూత్ర దారులను పట్టుకున్న పోలీసులు గ్రూప్1 లీకేజీ కేసులో ఎందుకు పట్టుకోలేదు. అందుకే దీనిలో పెద్దల ప్రమేయం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ సీఎం ఈ కేసులో నిజానిజాలను చెప్పే ప్రయత్నం చేయడం లేదు. కేటీఆర్‌ను పంపించి సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ కేసులో నిరుద్యోగులందరికీ న్యాయం జరగేలా చూడాలి. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి. పరీక్షలన్నీ కూడా కొత్త బోర్డు వచ్చిన తర్వాతనే జరపాలని నినాదంతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నాం. 18వ తేదీన ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష జరగబోతుంది."
ఇవీ చదవండి: