BSP Telangana Bharosa Sabha in Hyderabad Today : హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో 'తెలంగాణ భరోసా సభ' జరగనుంది. ఈ బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. "బహుజన ధర్మం పాటిద్ధాం.. బహుజన రాజ్యం సాదిద్ధాం" నినాదంతో జరగనున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేసింది. ఈ మేరకు సరూర్‌నగర్ మైదానంలో సభ ఏర్పాట్లు చేసింది. నగరంలో పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల.. 30 లక్షల మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తూ 'తెలంగాణ భరోసా సభ'కు బీఎస్పీ పిలుపునిచ్చింది.
సభలో ఆ సమస్యలపై ప్రస్తావించనున్న మాయావతి: అకాల వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మాయావతి ప్రస్తావిస్తారని సమాచారం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ కాంట్రాక్టులైన ఆర్టిజన్లకు అండగా ఉంటామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పన వరకు పోరాటం చేస్తామని బీఎస్పీ పార్టీ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ అసిస్టెంట్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, ప్రత్యేకించి రైతాంగం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మాయావతి భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీలో అప్పట్లో ఉన్న 36 మంది ఎంపీలతో ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడమే కాకుండా ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించడం ద్వారా సాధనలో తమ పాత్ర కూడా ఉందని ఆమె ప్రస్తావించనుంది.
బహుజన రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు: నరేంద్ర మోదీ సర్కారు, తెలంగాణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఎస్పీ పోరాటం చేస్తుందని మాయవతి భరోసా ఇస్తారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్న బీఎస్పీ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పని చేస్తోంది. పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పట్నుంచే మంచి వ్యూహాలు రచిస్తోంది. 'తెలంగాణ భరోసా యాత్ర' ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న బీఎస్పీ.. అందుకు తగ్గట్లు సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై మాయావతి మార్గనిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బహుజన రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: