కేంద్రం ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మేస్తున్న ప్రజల ఆస్తులపై పోరాటం చేయాల్సిన అవసరముందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎస్సీ వర్గాల ఎదుర్కొంటున్న సమస్యలపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌తో కలిసి ఆయన చర్చించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రవీణ్‌కుమార్ ఆయనతో భేటీ అయ్యారు.
ప్రధానంగా బహుజనుల సమస్యలపై చర్చించేందుకు అద్దంకి దయాకర్‌ను కలిసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ కులాల మధ్య వచ్చిన ఇబ్బందులను తొలగించే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధిని అయినప్పటికీ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడిగానే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో ఆత్మీయ సమావేశమైనట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. దళిత ఎజెండా ఎవరు తీసుకున్నా మాలమహానాడు మద్దతు ఇస్తుందని అయన పేర్కొన్నారు. ప్రవీణ్‌కుమార్ భవిష్యత్ రాజకీయాల్లో రాణించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. బీఎస్పీకి, కాంగ్రెస్‌కు ఎలాంటి వైరుధ్యం లేదన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
దళితుల సమస్యలపై ఈరోజు ప్రవీణ్ కుమార్‌తో చర్చించాం. ముఖ్యంగా బహుజనుల సమస్యలపై మాట్లాడాం. అలాగే దళితులకు 3 లక్షల ఎకరాల భూములు కొన్ని వర్గాలే తీసుకోవడంపై చర్చించాం. విద్య, ఆరోగ్యం పూర్తిగా నిర్వీర్యం అవ్వడం వల్ల రిజర్వేషన్ వర్గాలకు జరుగుతున్న నష్టాలపై మాట్లాడాం. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై నిరుద్యోగులకు ఏవిధంగా నష్టం జరుగుతుందో.. వీటిపై ఎలా ముందుకు సాగాలన్నది ప్రధాన ఎజెండాగా సమావేశంలో నిర్ణయించాం.- అద్దంకి దయాకర్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు
అన్ని సామాజిక వర్గాలపై అద్దంకి దయాకర్ అన్నతో చర్చించాం. దేశంలో బహుజనులకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ప్రధానంగా మాట్లాడుకున్నాం. ఎస్సీ కులాల మధ్య భేదాభిప్రాయాల పరిష్కారంపై చర్చించాం. కేంద్రం ప్రజల ఆస్తులను విక్రయిస్తున్న అంశం కూడా చర్చకు వచ్చింది. అంతే కాకుండా రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంది. దానిపై కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. - ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్
ఇదీ చూడండి: RS PRAVEEN KUMAR: 'భాజపా, తెరాస ఒకే ఒరలోని రెండు కత్తులు'