BRS Special Strategy against Disgruntled Leaders in Telangana : శాసనసభ ఎన్నికలకు(Telangana Assembly Election 2023) ఇంకా దాదాపు 50 రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీలు తమదే విజయమని ప్రచారం చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తున్నాయి. ఈలోపు గులాబీ దళం మాత్రం ఒకవైపు సొంత పార్టీలోని అసంతృప్తులను దారికి తెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులను ఆకర్షించే పనిలో పడింది. హస్తం పార్టీలో టికెట్ దక్కే అవకాశం లేక.. అసంతృప్తితో ఉన్న వారిని, అభ్యర్థులకు సహకరించని ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.
ఇప్పటికే వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోగా.. కాంగ్రెస్ జాబితా ప్రకటించిన తర్వాత ఇంకొందరు వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అందులో ఇల్లందు అభ్యర్థికి సహకరించబోమని చెప్పిన పార్టీ నాయకులతో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్(Congress MLA Candidate List) కోసం పలువురు పోటీపడగా.. జడ్పీ మాజీ ఛైర్మన్ బాలూనాయక్‌కు వచ్చే అవకాశం ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్ నేత బిల్యా నాయక్.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
DCC President Sridhar Joined BRS Party : గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన బిల్యానాయక్ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. దేవరకొండలో ఇప్పటికే బీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థికి సీటు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు వేరే పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్‌కు కాంగ్రెస్ టికెట్ ఖరారయ్యే అవకాశం ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్‌రావు వెళ్లి.. బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదే స్థానం నుంచి టికెట్ ఆశించిన తిరుపతిరెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే శశిధర్‌రెడ్డి కూడా చేరితే మెదక్ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరినట్లు అవుతుంది.
Telangana Election BRS Plan 2023 : ఈసారి మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఎలాగైనా మైనంపల్లి హనుమంతరావుకే ఖరారు అవుతుందని భావించి.. మెదక్ డీసీసీ అధ్యక్షుడు శ్రీధర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆఖరికి ఆయనను కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చి నేరుగా బీఆర్ఎస్లో చేరారు. అనంతరం శ్రీధర్‌కు అత్యంత వెనకబడిన తరగతుల కార్పొరేషన్(ఎంబీసీ)కి ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత అభిలాశ్‌రావు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
సొంత నేతలతో వరుస భేటీలు : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే వారితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. స్టేషన్ ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ఇచ్చింది. అలాగే నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పలు దఫాలు చర్చించారు. అయితే ఇప్పటి వరకు అక్కడి అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే ఉప్పల్‌లో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి వేరే పార్టీలోకి వెళ్లకుండా చూస్తున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి, వికారాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా మానుకొండూరు నుంచి కూడా కాంగ్రెస్‌లోకి చేరికలు జరిగాయి. ఇలాంటి చోట్ల బీఆర్ఎస్కు నష్టం కలుగకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమవైపు తిప్పుకుంటుంది.