BRS MLC Kavitha on Singareni Elections 2023 : సింగరేణి ఎన్నికల్లో(Singareni Elections) ఆత్మసాక్షిగా ఓట్లు వేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ను గెలిపించాలని సంఘం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఓ ప్రకటన విడుదల చేశారు.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి సంస్థ ఎదుగుదల, సంస్థను లాభాల బాట పట్టించేందుకు కార్మికుల సంక్షేమానికి కేసీఆర్(KCR) ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని కవిత(MLC Kavitha) గుర్తు చేశారు. సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడారన్న కవిత టీబీజీకేఎస్(TBGKS) కార్మికుల హక్కులను సాధించిందని పునరుద్ఘాటించారు. కార్మికుల గొంతుకైన తమ సంఘం బాణం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత కోరారు.
TBGKS Contest in Singareni Elections : బీఆర్ఎస్(BRS) హయాంలో దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కోల్ ఇండియాలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కవిత పేర్కొన్నారు.
మొదలైన సింగరేణి ఎన్నికల కోలాహలం
గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటికి లాభాల్లో కార్మికులకు వాటా కేవలం 18 శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు. కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసౌకర్యం కల్పించారని చెప్పారు.
సొంత ఇల్లు నిర్మించుకునే వారికి 10 లక్షల మేర రుణం వరకు సంస్థనే వడ్డీ భరించడం ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్ అమలు వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత పేర్కొన్నారు. కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సింగరేణి కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
టీబీజీకేఎస్‌ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం తమదని తేల్చి చెప్పారు. సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు గౌరవాధ్యక్షురాలు కవిత తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఒక్క సమ్మె కూడా చేయాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు, డిమాండ్లను సాధించుకున్నట్లు చెప్పారు.
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలి : కోదండరాం