CM KCR to Announce BRS MLA Candidates in August : సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ అధిష్ఠానం ఆగస్టు మూడోవారంలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. పలుదఫాల సర్వేల తర్వాత ఎక్కువమంది అభ్యర్థుల విషయంలో... తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధిక మాసం ముగియగానే తొలివిడతగా సింహభాగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా అప్రతిష్ఠ పాలుకావడం, నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత ఉందనుకున్న వారి స్థానాలను మినహాయించి మిగతా చోట్ల మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి.
BRS focus on Telangana Assembly Elections 2023 : గత ఎన్నికల్లో పార్టీ తరఫున విజయం సాధించిన వారితో పాటు ఇతరపార్టీల నుంచి వచ్చిన వారితో కలిసి ప్రస్తుతం బీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక జరగలేదు. వాటితోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న.. మరో 15 నియోజకవర్గాలు కలిపి మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పార్టీ తరఫున గెలిచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి నియోజకవర్గాల్లో... ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన వారున్ననియోజకవర్గాల్లో అక్కడ ఓడిపోయిన వారి నుంచి అభ్యర్థిత్వం కోసం పోటీ ఉంది. ఐతే అవకాశం ఉన్న మేరకు ఇప్పటికే సర్దుబాటు చేయగలిగిన వారిని చేశామని... అన్ని అవకాశాలు ఇచ్చినా అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతామనే వారి విషయంలో చేసేదేంలేదనే ధోరణిలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.
ఆగస్టు మూడోవారంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన : సర్వేల ఆధారంగా ఏ ఇబ్బందిలేని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనే అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు తెలిసింది. మూడువిడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని కొన్నాళ్లక్రితం వరకు ఆలోచన ఉన్నా రెండువిడతల్లోనే తేల్చేయాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నిర్ణయం ఏదైనా దాదాపు ఒకేసారి తీసుకోవాలని... జాప్యం జరిగేకొద్దీ ఖరారుకాని వారిలో అసంతృప్తి, అనుమానం నెలకొనే అవకాశం ఉందని అలాంటి వాటికి తావివ్వరాదనే అభిప్రాయంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందనుకున్న చోట చివరి వరకు ఆగాలనుకుంటున్నారని సమాచారం. కొత్తగా చేర్చుకొని టికెట్ ఇచ్చే పరిస్థితి పార్టీలో దాదాపు లేదు. అలాంటప్పుడు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు ఇబ్బంది ఏం ఉంటుందని... పార్టీ ముఖ్యనేత అభిప్రాయపడ్డారు. ఆగస్టు మూడోవారంలోనే ఎక్కువమంది అభ్యర్థులని ప్రకటిస్తే ఎక్కడైనా సమస్యలు వస్తే పరిష్కరించుకునేందుకు తగిన సమయం ఉంటుందని మరో ముఖ్యనాయకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టికెట్ పక్కా : గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారిలో పలువురు అధికార పార్టీలో చేరారు. రామగుండం నుంచి ఫార్వర్డ్‌బ్లాక్ తరఫున, వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వారితో పాటు టీడీపీ నుంచి గెలిచిన వారు గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభావం బాగా ఉన్నా ఇతర పార్టీల నుంచి గెలిచారంటే స్థానికంగా పట్టు ఉండటం వల్లే సాధ్యమైందనే భావన ఉంది. ఇతర పార్టీల్లో గెలిచి వచ్చి చేరారు కాబట్టి... వీలైనంత వరకు వారెవరినీ మార్చరాదనే అభిప్రాయంతో ఉన్నా వారిలోనూ కొందరిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన వారు ఇక లాభం లేదనుకొని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోగా... ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌తోపాటు బీజేపీలోకి వెళ్లారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా... మళ్లీ టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Telangana Assembly Elections 2023 : మహేశ్వరం, నకిరేకల్‌లో గత ఎన్నికల్లో ఓడిపోయిన తీగలకృష్ణారెడ్డి, వీరేశంలు హస్తం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా వారి నుంచి ఏ ప్రకటన లేదు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా కోరుతోంది. ఆసిఫాబాద్‌లో గత ఎన్నికల్లో... కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు అధికార పార్టీలో చేరగా... ఓడిపోయి ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న కోవా లక్ష్మి మళ్లీ పోటీకి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన ఉపేందర్‌రెడ్డి... తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉండగా అక్కడ నుంచే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ తరఫున ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి బీఆర్ఎస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించింది. రామగుండం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. అధికార పార్టీ నాయకులే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి స్థానాల్లో బీఆర్ఎస్ అధిష్ఠానం ఏం చేస్తుందన్నది వేచిచూడాల్సి ఉంది.
ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యం : గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా... మరికొందరికి నియోజకవర్గంలోని నాయకులతో సరైన సంబంధాలు లేవు. అలాంటి చోట్ల మరింత ఎక్కువ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అలాంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఐతే ఒకరిని మార్చితే అందుకు అనుగుణంగా ఇతర మార్పులు చేయాల్సి ఉంటుందని.. ఇలాంటి చోట్ల ప్రత్యర్థి అధికార పార్టీ ప్రభావానికి మించి బలంగా ఉన్నారని భావిస్తేనే మార్పు గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. ఈ తరహా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి చివరివరకు సమయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి :