BRS MLA Candidates B Forms Issue 2023 : రాష్ట్రంలో ఎన్నికల(TS Assembly Elections 2023) నగరా మోగింది. ప్రధాన పార్టీలన్నీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫాంల అందజేతలో, ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్.. ఇప్పటి వరకు 109 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరో పది మందికి మాత్రం ఇంకా బీఫామ్‌లు అందించలేదు. మరోవైపు నర్సాపూర్, అలంపూర్ స్థానాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Alampur BRS MLA Candidate Issue : బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్(CM KCR) తొలి విడతలో ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో.. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కూడా ఉన్నారు. అయితే అబ్రహాంకు మినహా.. మిగిలిన వారందరికీ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫాంలు అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరొకరికి బీ ఫామ్ ఇవ్వాలని అధిష్ఠానంపై చల్లా ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు తనకే బీ ఫాం ఇవ్వాలని అబ్రహం మంత్రి హరీశ్‌రావును, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించినట్లుగా తెలిసింది.
Narsapur BRS MLA Candidate Issue : తొలివిడతలో అభ్యర్థులను ప్రకటించని గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్సాపూర్, స్థానాల్లో ఇప్పటికే జనగామ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీ ఫాంను అందించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరిగింది. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికే సీటు ఇవ్వాలని ఆయన వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. అయితే నర్సాపూర్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధత తొలగకపోవడంతో.. ఇక్కడ కూడా బీ ఫాంను ఇవ్వలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ రెండు నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు గాను.. ఇంకా అలంపూర్, నర్సాపూర్, గోషామహల్, మలక్‌పేట, యాకుత్‌పురా, నాంపల్లి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పురా, కార్వాన్ .. కలుపుకొని 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీ ఫాంలు అందాల్సి ఉంది. ఇక బీ ఫాం అందుకున్న నేతలందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు.