BRS Meeting for Mahabubabad for MP Elections : గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినప్పటికీ ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదని, అటువంటి అంశాలను ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు పోదామని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని, అందుకే నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారని వివరించారు.
కాంగ్రెస్(Congress) తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని కేటీఆర్ తెలిపారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారని, తొమ్మిదిన్నరేళ్లలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 73 శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచామన్న ఆయన, ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యామని పేర్కొన్నారు.
తార్ మార్ తక్కర్ మార్ - మళ్లీ టీఆర్ఎస్గా మారనున్న బీఆర్ఎస్?
KTR Meeting on Parliament Elections : కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచే వాళ్లమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఏనాడు ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని, ప్రజల సౌకర్యం చూశాం తప్ప రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్, బీఆర్ఎస్కు మూడో వంతు సీట్లు 39 వచ్చాయని గుర్తు చేశారు.
స్థానిక సంస్థలు మొదలు అసెంబ్లీ వరకు బలమైన నాయకత్వం ఉందని, అన్నింటికీ మించి కేసీఆర్(KCR) లాంటి గొప్ప నాయకుడు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికలే గెలుపునకు సోపానం కావాలని అన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా నిర్వహిస్తామని, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ వివరించారు.
జోరుగా బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు - పార్టీ శ్రేణుల అభిప్రాయాలపై అధినేత కేసీఆర్ అధ్యయనం
ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో సీఎంకే స్పష్టత లేదు : కడియం శ్రీహరి