BRS Manifesto Release Today 2023 : ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నేడు కీలక అడుగు వేయనుంది. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థులకు భీ-ఫారమ్‌లు, హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ(BRS Public Meeting in Husnabad)తో సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ యుద్ధాన్ని ప్రకటించనున్నారు. ఇందుకు ముందు నుంచి తీవ్రమైన కసరత్తును ప్రారంభించారు.
BRS Manifesto in Telangana 2023 : ఎన్నికల మేనిఫెస్టో(BRS Election Manifesto)ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ప్రకటించనున్నారు. మేనిఫెస్టోపై కొంతకాలంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు.. వివిధ సర్వేల ఆధారంగా మేనిఫెస్టోని సిద్ధం చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల ఆర్థికసాయాన్ని మరింత పెంచనున్నట్లు హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళలను ఆకర్షించేందుకు రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రైతులకు ఫించన్లు, ఉచితంగా ఎరువులను.. మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
B forms to BRS Candidates Telangana 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులకు నేడు కేసీఆర్ బీఫారాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు.. బీఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి.
అయితే గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో.. ఇద్దరు, ముగ్గురిని మార్చవచ్చునని ప్రచారం సాగుతోంది. బీ ఫారాలు పంపిణీతో పాటు ఎన్నికల(Telangana Polls)పై.. అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా మేనిఫెస్టోను వివరించాలని చెప్పనున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలో అభ్యర్థులకు కేసీఆర్ తెలపనున్నారు. నామినేషన్, అఫిడవిట్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు వివరించనున్నారు.
BRS Public Meeting in Husnabad : అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రచార శంఖారావం మోగించనున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి హుస్నాబాద్‌లో తొలి ప్రచారసభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ, మేనిఫెస్టో విడుదల తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ వెళ్లి సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నేటి నుంచి నవంబరు 9వరకు 41 సభల్లో ప్రసంగించనున్నారు. హెలికాప్టర్ ద్వారా.. రోజూ రెండు, మూడు సభల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు.