BRS Leaders Focus on Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు నేతలు, పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తమకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వారు అందరూ మరోమారు పోటీపై ఆశలు పెట్టుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఇందులో కొంతమందికి అవకాశం రాదన్న ప్రచారం పార్టీలో ఉంది. దీంతో ఆయా స్థానాల్లో ఇతర నేతలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ప్రయత్నాలు ప్రారంభించారు.
బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలు - కార్యకర్తల చేతిలో స్టీరింగ్
మహబూబ్‌నగర్ నుంచి పోటీలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాన్ని పెట్టడంతో పాటు పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడా మహబూబ్‌నగర్ లేదా మల్కాజిగిరి పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. నాగర్ కర్నూల్ నుంచి మాజీ విప్ గువ్వల బాలరాజు పేరు ప్రచారంలో ఉంది. పాలకుర్తిలో ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు భువనగిరి లేదా మల్కాజిగిరి లోక్‌సభ సీట్లలో ప్రచారం ఉంది. అక్కడి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, గొంగిడి సునీత, క్యామ మల్లేష్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో శేఖర్ రెడ్డి అంతగా ఆసక్తితో లేరని అంటున్నారు.
జోరుగా బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు - పార్టీ శ్రేణుల అభిప్రాయాలపై అధినేత కేసీఆర్ అధ్యయనం
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ప్రచారంలో ఉంది. మాజీ విప్ బాల్క సుమన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఆయన అక్కణ్నుంచి విజయం సాధించారు కూడా. అధిష్ఠానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటిస్తున్నారు. అయితే ఆయన తన కుమారుడు లేదా కోడలికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మల్కాజిగిరిలో అవకాశం కోసం పలువురు ఇతర నేతలు కూడా కోరుతున్నారు. రావుల శ్రీధర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, రాగిడి లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్‌లు అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ తరపున మల్కాజిగిరిలో తనకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన కోరినట్లు తెలిసింది. బొంతు రామ్మోహన్, దాసోజు శ్రవణ్ మల్కాజిగిరి కాకపోతే, సికింద్రాబాద్‌లో అయినా అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్ రావు
2019లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తలసాని సాయి కిరణ్ మరోమారు పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి 2014లో గెలిచిన నగేశ్, 2019లో ఓటమి పాలయ్యారు. దీంతో మరోమారు అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరు కూడా ఆదిలాబాద్ నుంచి పరిశీలనలో ఉంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని అధిష్ఠానం, ఎంపీకి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. 2014లో మహబూబాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన సీతారాం నాయక్‌కు, 2019లో పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈమారైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న జీవన్ లాల్ పేరు కూడా ఈ స్థానానికి ప్రచారంలో ఉంది.
తార్ మార్ తక్కర్ మార్ - మళ్లీ టీఆర్ఎస్గా మారనున్న బీఆర్ఎస్?
నిజామాబాద్ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కవిత, ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోమారు లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జహీరాబాద్ నుంచి తన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని లోక్ సభకు పంపాలని బీఆర్‌ఎస్ నాయకత్వం శాసనసభ ఎన్నికల సమయంలో నిర్ణయించింది. దీంతో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. సీనియర్ నేత గాలి అనిల్ కుమార్ కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ లోక్ సభకు వెళ్లాలని నిర్ణయించుకుంటే మెదక్ నుంచే బరిలో దిగే అవకాశం ఉంది.వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, రాజయ్య పేర్లు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్
ఖమ్మం నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా ప్రచారంలో ఉంది. నల్గొండ నుంచి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు పది లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను భారత రాష్ట్ర సమితి నిర్వహించింది. అందులో చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానించినట్లు నేతలు తెలిపారు. అధినేత కేసీఆర్ అందరితో చర్చించి, అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేస్తారని, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 22వ తేదీతో సన్నాహక సమావేశాలు పూర్తి కానున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు - గట్టిగా పోరాడాల్సిందే : కేటీఆర్