BRS focus on Greater Hyderabad MLA Seats : వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిపై పూర్తి పట్టును కొనసాగించేందుకు.. భారత్ రాష్ట్ర సమితి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గణనీయస్థానాల్లో విజయం సాధించినప్పటికి.. కొన్ని నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో పరాభావానికి గురైంది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కక పోగా.. బీజేపీ అనూహ్యమైన సత్తా చాటింది.
ఈ క్రమంలోనే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని.. బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికి.. కొన్ని నెలల క్రితం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇలా పలు సందర్భాల్లో నగరంలో కమలం పార్టీ ప్రభావం చూపుతున్నందున.. పకడ్బందీగా వ్యవహరించేందుకు అధికార పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం అస్త్రాలుగా ముందుకెళ్తూనే.. మరోవైపు రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులకు అందలేనంత ఎత్తులో ఉండేలా.. బీఆర్ఎస్ బహుముఖ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఏడు స్థానాల్లో ఎంఐఎం శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేలు.. ఆ ఏడు స్థానాలు మాత్రం మళ్లీ మజ్లిస్ పార్టీవేనని చెబుతున్నాయి. ఆ ప్రాంతాల్లో భారత్ రాష్ట్ర సమితి పోటీ నామమాత్రమే ఉండబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికి.. ఇప్పుడు వారిద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు. గోషామహల్‌లో బీజేపీ తరపున రాజాసింగ్ విజయం సాధించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బలు తగిలాయి.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో బీజేపీ గెలిచింది. ముషీరాబాద్‌లోనూ ఒక్క సీటూ గెలవలేక పోయింది. అంబర్‌పేటలో రెండు వార్డుల్లోనే గెలవగలిగింది. హబ్సిగూడ వార్డులో ఉప్పల్ ఎమ్మెల్యే భార్య ఓడిపోయారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. తాజా సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయంటున్న బీఆర్ఎస్.. గ్రేటర్‌లో సిట్టింగ్ స్థానాలన్నీ మళ్లీ గెలుస్తామని ధీమాతో ఉంది. రానున్న ఎన్నికల్లో గోషామహల్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్ తదితర స్థానాల్లో గట్టి పోటీ ఉండవచ్చునని అంతర్గత సర్వేల్లో తేలినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Competition for MLA Tickets in BRS : గ్రేటర్‌లో పట్టుకోసం బీఆర్ఎస్ అధిష్ఠానం పకడ్బందీ ఎత్తులు వేస్తుండగా.. మరోవైపు టికెట్ల కోసం నేతల పోటీ తీవ్రమవుతోంది. నాయకుల మధ్య పోటీ ఒకదశలో శృతి మించి హైకమాండ్ జోక్యం చేసుకొనే వరకు వెళ్తోంది. ఆషాడం తర్వాత తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి కేసీఆర్ సిద్ధం అవుతున్నందున.. నేతలు ఇక చావో రేవో అనే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొందరు సిట్టింగ్‌లను మారుస్తారన్న ప్రచారంతో.. గ్రేటర్ ఎవరి సీటు ఖాళీ అవుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం అందరూ పూర్తి ధీమాతోనే ఉన్నారు.
BRS Party Latest News : టికెట్ల కోసం పోటీపడే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు.. కొన్నిసార్లు వీధికెక్కుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో కానీ పార్టీలో కానీ తనకు తిరుగే లేదన్న ధీమాతో మంత్రి మల్లారెడ్డి కనిపిస్తున్నారు. అయితే మంత్రి తీరుపట్ల.. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి భగ్గుమంటున్నారు. ఇద్దరూ ఒక వేదికపైకి వచ్చారంటే బహిరంగంగానే పరస్పరం తమ ఆధిపత్యం చూపేలా వ్యవహరిస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కొంతకాలంగా.. నువ్వా నేనా అనేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లతో ఇద్దరు నేతలకు సాన్నిహత్యం ఉండటంతో.. ఎవరితో వెళ్లాలనే సందిగ్ధతతో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి ప్రతీ విషయంలోనూ ఇద్దరి మధ్య పోటీ.. కొన్ని సార్లు శృతి మించుతోంది.
Telangana Assembly Elections 2023 : ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. గతంలో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ వర్గాల మధ్య కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాతావరణమే నెలకొంది. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బదులుగా తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీతో తాడో పేడో తేల్చుకుంటానంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహిరంగంగానే ఆల్టిమేట్టం ఇస్తున్నారు. అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై గెలిచిన న్యాయవాది.. కాలేరు వెంకటేశ్ మళ్లీ టికెట్ తనదే అంటున్నారు. అయితే అంబర్‌పేట నుంచి 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి మళ్లీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.
పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి.. ఈ సారి బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా తనకే ఉందని అధిష్ఠానానికి వివరించడంతో పాటు.. స్థానికంగా కార్పొరేటర్లను తనవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు పోటీగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న అకాల మరణంతో.. అక్కడ తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె, కార్పొరేటర్ లాస్య నందిత కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ క్రిశాంక్, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేశ్ పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
తమకు అవకాశం ఇవ్వాలి : మరికొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి స్థాయిలో పోటీ లేకపోయినప్పటికి.. తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు అధిష్ఠానాన్ని కోరుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లుతున్నారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావుతో పాటు.. బీఆర్ఎస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీల్లో పర్యటిస్తూ, అవసరమైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేస్తూ ప్రజల్లో చొచ్చుకెళ్లడంతో పాటు.. ఉద్యమకాలం నుంచి తన కుటుంబం చేసిన కార్యక్రమాలను వివరిస్తూ అధిష్ఠానం మెప్పుపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Competition for MLA Tickets in BRS : ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన క్యామ మల్లేశ్ కూడా ఆశిస్తున్నారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ హ్యాట్రిక్‌పై ధీమాతో ఉండగా.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బండి రమేశ్ కోరుతున్నారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ తనకే మళ్లీ టికెట్ అంటుండగా.. ఉద్యమకాలం నుంచి పార్టీని నమ్ముకున్న తనకు ఎందుకు ఇవ్వరని సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి వంటి నేతలు అడుగుతున్నారు. ముషీరాబాద్ మళ్లీ తనదేనని ముఠా గోపాల్ అంటుండగా.. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్ఎన్ శ్రీనివాస్ తదితరులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి :