Kishan Reddy On CM KCR : పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కారణంగా నష్టపోతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాజకీయపరమైన స్వలాభం కోసం, ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించడమే తప్ప.. బీఆర్ఎస్ సర్కారు బాధ్యతల్ని నిర్వర్తించటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు వచ్చేందుకు కేసీఆర్‌కు తీరిక ఉండదని ఆరోపించిన కిషన్‌రెడ్డి.. రాజకీయ స్వలాభం కోసం ఎక్కడికైనా వెళ్తారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్లో జరిగిన కౌశల్ మహోత్సవ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే.. ప్రారంభం ఆగిపోతుందా : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందానని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమని.. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్విన్ టవర్స్ శిలాఫలకంపై స్థానిక ఎంపీనైన నా పేరు కూడా లేదని.. బీఆర్ఎస్తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని తెలిపారు. రేపటి నీతిఅయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని.. సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు.
"తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమావేశానికి రాడు. ఈ 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ మీటింగ్కు కూడా రావటం లేదని వర్తమానం అందింది. ఇది ఒక బాధ్యతారహితమైన చర్య. ఈ రకంగా భారత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు సీఎం రాలేదు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేసీఆర్ రారు. కాని మహారాష్ట్ర వెళ్లడానికి మాత్రం సమయం ఉంటుంది." - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
జాబ్ మేళాకు నిరుద్యోగులు హాజరు కావాలి : జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరిగే జాబ్ మేళాకు భారీగా నిరుద్యోగులు హాజరుకావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనేక సంస్థలతో కలిసి ఈ మేళాను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 8వ తరగతి పాసైన, ఫెయిలైన 18 సంవత్సరాలు నిండిన 35 సంవత్సరాలు మధ్యలో ఉన్నవారికి ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన కార్యక్రమం రూపకల్పన చేసి.. స్కిల్ ఇండియా పేరుతో యువతను స్కిల్స్ వైపు నడిపించడం జరుగుతోందని స్పష్టం చేశారు. అందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తే.. ఇళ్లల్లో మరి ప్లంబింగ్ పనులు ఎవరు చేస్తారని తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఇక్కడి నుంచి స్కిల్స్ గల యువతను తీసుకొని వెళుతున్నారని చెప్పారు.
ఇవీ చదవండి :