BRS Leaders on PM Modi Comments : బీజేపీపై కొంత కాలంగా దాడి, ఎదురుదాడి చేస్తున్న భారత రాష్ట్ర సమితి.. ప్రధాని పర్యటన ముందు, తర్వాత అదే ధోరణి కొనసాగించింది. ప్రధాని సభకు జన సమీకరణతో బల ప్రదర్శనకు బీజేపీ ప్రయత్నించగా.. అదే సందర్భంగా బీఆర్ఎస్ తమ సత్తాను చాటే దిశగా సింగరేణి జిల్లాల్లో మహాధర్నాలు చేసింది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందంటూ.. రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాలలో సింగరేణి కార్మికులతో కలిసి ఆందోళనలకు దిగింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సభ ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రధాని విమర్శలకు అదే స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. అవినీతి, కుటుంబ పాలన అంటూ సాగిన ప్రధాని ప్రసంగాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ నేతలు స్పందించారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్, బాల్క సుమన్ తదితర నేతలు ఎదురు దాడి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు, మంత్రుల అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని మంత్రులు, నేతలు ఆరోపించారు.
మంత్రుల కామెంట్స్: ప్రధాని శంఖుస్థాపనల కోసం కాకుండా.. అబద్ధాలు చెప్పి.. కడుపులో విషం కక్కేందుకు వచ్చినట్లు ఉందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అదానీ వాదంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు.. లేని పరివార వాదంపై ప్రధాని మాట్లాడారని ఆరోపించారు. వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదా అని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గతంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఆరోపించిన మోదీ.. ఇప్పుడు విపక్షాలను తప్పు బట్టడం తగునా అని మంత్రి ప్రశ్నించారు. రానున్న యాసంగి పంట, రేషన్ కార్డులు, గురుకుల విద్యాసంస్థలపై నరేంద్ర మోదీ ఏమీ చెప్పకుండా అన్ని వర్గాలను నిరాశపరిచారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మోదీ ప్రసంగం ఆక్రోశం, అక్కసుతో కొనసాగింది.. తప్ప రాష్ట్రానికి పనికొచ్చే మాటే లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు సభలు, మీడియా సమావేశాలు, పత్రిక ప్రకటనలు, ట్వీట్లతో మోదీపై ఎదురుదాడి చేశారు. విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీలో ఒకే కుటంబానికి చెందిన నేతల జాబితాలను ప్రదర్శించారు. అదానీ అవినీతికి కొమ్ము కాస్తున్నది ప్రధాని కాదా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసం కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేశారని విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణులన్నీ ముక్తకంఠంతో ఖండించగా.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు ప్రధాని పర్యటనపై స్పందించలేదు.
ఇవీ చదవండి: