BRS Chief KCR Discharge From Hospital Tomorrow : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం (రేపు) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి పడడంతో వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్(KCR) కోలుకోవడంతో రేపు మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు.
వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని ఇప్పటికే తెలిపారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్ ఉండనున్నారు. ఆ ఇంటిని గత కొన్నేళ్లుగా కార్యాలయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. కేసీఆర్ సహా కుటుంబసభ్యులు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దారు.
Ex CM KCR Video Message : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనను చూసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. మీరు ఇలా రావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వందలాటి మంది పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తాను త్వరగా కోలుకొని, సాధారణ స్థితికి చేరుకుని మీ ముందుకు వస్తానని వీడియోను విడుదల చేశారు. అయితే సిద్దిపేట ఎర్రవెల్లి ఫాంహౌస్(KCR Farm House)లో కాలు జారి పడిపోయి ఆసుపత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
KCR Undergoing Treatment at Yashoda Hospital : ముందుగా ప్రధాని మోదీ(Modi) ఎక్స్ వేదికగా కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నూతనంగా సీఎం బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, బీఆర్ఎస్ నేతలు, సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు నిత్యం ఆసుపత్రికి వచ్చేవారు. దీంతో యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో నిత్యం భారీ స్థాయిలో బందోబస్తు ఉండేది.
అసలేం జరిగింది : ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి కేసీఆర్ తన ఫాంహౌస్‌లో కాలు జారి కింద పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ అన్ని పరీక్షలు చేసిన వైద్య నిపుణులు తుంటి మార్పిడి శస్త్రచికిత్సను 8వ తేదీన విజయవంతంగా చేశారు. అక్కడి నుంచి డాక్టర్లు కేసీఆర్‌కు 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరం అని సూచించారు. ఆయనకు శస్త్రచికిత్స జరిగిన రోజే వైద్యులు ఆయనను నడిపించే ప్రయత్నం చేశారు.
ఆసుపత్రిలో కేసీఆర్ పుస్తక పఠనం - పరామర్శించిన పలువురు ప్రముఖులు
'నన్ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు' - కేసీఆర్ వీడియో సందేశం