BRS Candidates Election Campaign Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ప్రచారాలను ముమ్మరం చేసి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజల్లోకెళ్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల మూలంగా మరోమారు అధికారంలోకి వస్తామని తార్నాక డివిజన్‌లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. పేదప్రజలకు పెద్దపీట వేయడమే తమ లక్ష్యమంటూ ప్రచారాన్ని కొనసాగించారు.
వరల్డ్ కప్‌లో ఇండియా - తెలంగాణలో కేసీఆర్ మూడో విజయం ఖాయం : కేటీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు పోతున్నామని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్‌కు చెందిన నాయి బ్రాహ్మణులు, పలువురు మహిళా సంఘాల నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
CM KCR Assembly Elections Campaign 2023 : మరోవైపు జిల్లాల్లోనూ నాయకుల ప్రచారం జోరందుకుంది. బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశానని.. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలంటూ కోటగిరి మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు.
మాస్ లీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు.. వివిధ కుల సంఘాలకు చెందిన 622 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని ఆయా పార్టీలు మున్నూరు కాపులకు కేటాయించడం తమ ఘనతేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపు కుల సంఘం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
'' ఎలక్షన్ సమయంలో ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అని కొంత మంది వస్తారు ఎవరూ నమ్మొద్దు. పండ్లను ఇచ్చే చెట్టునే నమ్మాలి కానూ ముళ్ల చెట్లను కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ది పనులు చేసింది. మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే ఎన్నో మంచి పనులు చేసుకోవచ్చు.'' - పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
Telangana Assembly Elections 2023 : ఖమ్మం జిల్లాలోనూ రాజకీయ వాతావరణం వేడిక్కింది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు.. సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఓ ఇంటికి వెళ్లి ఇంటి ఎదుట కట్టేసి ఉన్న పాడి గేదెను శుభ్రంగా కడిగి ఆ ఇంట్లో వారిని ఓట్లు అభ్యర్థించారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తనను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ.. ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ప్రచారాల జోరు హోరెత్తింది. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు వార్డులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కులు - ఒక్క ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు