వైకాపా ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని క్రైస్తవ సంఘాలు, బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఓ హోటల్‌లో క్రైస్తవ, బీసీ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్.. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు వైకాపాకు వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు.
"నేను రాజకీయ విషయాలు మాట్లాడను. నేనెప్పుడూ అసెంబ్లీ వైపు వెళ్లేవాడిని కాదు. నా బిజీలో నేను.. పథకాల బిజీలో సీఎం ఉన్నారు. అన్ని సమస్యలూ సీఎం దృష్టికి తీసుకెళ్తా. నేను సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయింది. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారు.. వారికి మద్దతుగా ఉంటా. ఎన్నికల ముందు నన్ను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది." -బ్రదర్ అనిల్
వివేకా హత్య కేసుపైనా స్పందించిన బ్రదర్ అనిల్.. దోషులు తప్పించుకోలేరని అన్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోందంటే చిన్న విషయం కాదన్నారు. త్వరలోనే దోషులెవరో తెలనుందని తెలిపారు.
ఇదీ చదవండి: రాజగోపాల్రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ