Covid Vaccination at home: తెలంగాణలో ఇంటింటికీ వెళ్లాలని.. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇళ్లకు వచ్చినప్పుడు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష జరిగింది.
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
నెల రోజుల్లో రాష్ట్రంలో అందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడక్కడా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంకీ ఫాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న హరీశ్ రావు... కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి లక్షణాలు కనిపిస్తే ఫీవర్ ఆసుపత్రికి తరలించి నమూనాలు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. మంకీ ఫాక్స్ చికిత్సకు ఫీవర్ ఆసుపత్రి నోడల్ ఆసుపత్రిగా పెట్టామన్న ఆయన... గాంధీ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేస్తామని అన్నారు. కిట్లు తెప్పిస్తున్నట్లు చెప్పారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫీవర్ ఆసుపత్రికి రావాలని కోరారు. విదేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో పరీక్షలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఉద్యమం తరహాలో భాగస్వామ్యం కావాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ, కొవిడ్ బూస్టర్ డోస్ విషయంలో అందరిలోనూ అవగాహన కల్పించాలని చెప్పారు. గురుకులాలు, వసతిగృహాల్లో ఆహారాన్ని తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలన్న ఆయన... కలెక్టర్లు వెళ్లి విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించాలని చెప్పారు.
- ఇవీ చూడండి.. JEE Exam 2022 : పరీక్షకు అరగంట ముందు సెంటర్ మార్పు