రాష్ట్రంలో ముడు నెలల తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ల బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ www.registration.telangana.gov.in ద్వారా స్లాట్లను....ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వెబ్‌సైట్‌లో బుక్‌యువర్ స్లాట్‌ను క్లిక్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఆ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందుకోసం ముందుగా పోర్టల్‌లో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మూడో దశలో రుసుం
ఆ తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, కాప్చా నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడున్న స్లాట్ బుకింగ్ లింక్‌ను.. క్లిక్ చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సేల్, మార్ట్ గేజ్, గిఫ్ట్ లావాదేవీలు ఎంచుకోవాలి. ఆస్తి వివరాలు, ఆస్తి ఉన్న ప్రాంతం వివరాలు, జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వివరాలు నమోదు చేయాలి. తదుపరి దశలో ఆస్తికి సంబంధించిన వివరాలు సర్వే నంబర్, ప్లాటు నంబర్, సరిహద్దులు తదితరాలు నమోదు చేయాలి. మూడో దశలో మార్కెట్ రుసుము, రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధరణ అవుతుంది. ఆస్తి వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ రుసుమును సాఫ్ట్‌వేర్ ఖరారు చేస్తుంది.
తొమ్మిదో దశలో స్లాట్
స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ రుసుం, పాస్ పుస్తకం, కొరియర్ ఛార్జీలు ఉంటాయి. తదుపరి దశలో అమ్మకందారు వివరాలు, చిరునామా నమోదు చేయాలి. ఐదో దశలో కొనుగోలుదారు వివరాలు, చిరునామా.. ఆరో దశలో కొనుగోలుదారు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చాలి. ఏడో దశలో సాక్షుల పేర్లు చేర్చాలి. ఆ తర్వాత డాక్యుమెంట్‌ను చూసుకోవచ్చు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఎనిమిదో దశలో ఆన్‌లైన్ లేదా చలాన్ ద్వారా నిర్ధారిత రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యాక తొమ్మిదో దశలో స్లాట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
వేరే లింక్ ఏర్పాటు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ఆధార్ సంఖ్య ఇవ్వడానికి ఇష్టం లేని వారికి వేరే లింక్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్ ప్లాట్లకు ఆస్తిపన్ను అంచనాకు సంబంధించిన సంఖ్య ఉండదు కాబట్టి...పీటీఐఎన్ లేదా టీపీఐఎన్ సంఖ్య కోసం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాటుకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు లేఔట్ వివరాలు, హద్దులను పొందుపర్చి రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌ను జతపరచాల్సి ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని ప్రస్తావించేందుకు ఇష్యూస్ ట్రాకర్ పేరిట ప్రత్యేక లింక్‌ను పొందుపరిచారు.
ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా ఈసీ, నిషేధిత ఆస్తుల వివరాలు పొందే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కార్యాలయంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ల లభ్యతను తెలుసుకునే సదుపాయాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఇదీ చూడండి : దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టు