నటనలో వచ్చిన పేరు కంటే వలస కార్మికులను ఇళ్లకు చేర్చడంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సేవలందించిన ఫ్రంట్‌లైన్ వారియర్లు, ప్లాస్మా దాతలకు సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్షలాది మంది వలస కార్మికులను ఇళ్లకు చేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గాయని స్మిత హాజరయ్యారు. తనకు తోచిన సహాయం అందించుకుంటూ ముందుకు వెళ్లానని సోనూసూద్ వెల్లడించారు. కరోనా సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు నన్ను కలిచివేశాయని.. అందుకే వారికోసం బస్సు ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు.
వారి ఆత్మ విశ్వాసం గొప్పది :
కరోనా మహమ్మారి ప్రారంభ దశలో మొదట రెండు, మూడు రోజులు లాక్ డౌన్ ఉంటుందని అందరూ భావించారు. కానీ మొదటిసారి లాక్డౌన్ సమయంలోనే పేదలకు దాదాపు 500 మందికి రేషన్ బ్యాగులు పంపిణీ చేశాం. ముంబయిలోనే ఓ ట్రక్కు పండ్లను పంపిణీ అందించాం. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు నడుచుకుంటు వెళ్లడం నన్ను కలిచివేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు చంటి పిల్లలతో కొన్ని రోజుల పాటు వెళ్తుండడం చాలా బాధ కలిగించింది.
రెండు గంటలు నడిస్తే చాలు
పది రోజుల పాటు ప్రయాణించాల్సిన సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు, మూడు గంటల్లో ఇంటికి చేరుకుంటామని చెప్తూ తీసుకెళ్లడం రికున్న ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఎవరి సాయం లేకుండా వారు ప్రయాణించడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నాకు ఒక్కరోజు సమయమిస్తే వాళ్ల స్వస్థలాలకు క్షేమంగా తరలిద్దామనుకున్నాను. వారిని ఎలా పంపించాలో నాకు మొదట తెలియలేదు. వారిని పంపించడానికి పోలీసుల నుంచి రవాణాశాఖ వరకు చాలా అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. మొదటిసారి 350 మందిని కర్ణాటకకు పంపించాం.
7లక్షల మందిని వారి ఇళ్లకు చేర్చాను..
అన్ని రాష్ట్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్న వలస కార్మికులను పంపించేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాం. కేవలం ఒక్క గంటలోనే లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయి. నాకు మెయిల్స్ వందల సంఖ్యలో వచ్చాయి. దేశ వ్యాప్తంగా 7,26,727 వలస కార్మికులను కార్మికులను వారి ఇళ్లకు చేర్చాను. చాలా మంది మాతో పాటు పనిచేసేందుకు ముందుకు వచ్చారు. కిర్గిస్తాన్ నుంచి మెడికల్ విద్యార్థులు సాయం కోసం ఫోన్ చేశారు. విదేశాల నుంచి చాలా దేశాల నుంచి విద్యార్థులను స్వదేశానికి రప్పించాను.
రెండు లక్షల మందికి ఉపాధి
లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కృషి చేశాం. కరోనా మహమ్మారి మనకు చాలా పాఠాలు నేర్పింది. నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. నువ్వు ఒకరికి సహయం చేస్తే వారి నుంచి వచ్చే దీవెనలు నీకు చాలా సంతోషాన్ని ఇస్తాయని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేదని సోనూసూద్ వెల్లడించారు.