కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో భాజపాను మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది.
రంగంలోకి దిగిన కీలక నేత?
వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ఓ కీలకనేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెరాస, కాంగ్రెస్, తెదేపా, తెజసకు చెందిన నేతలు ఆ నాయకుడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం వల్ల 2023 కల్లా రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా కమల దళం వ్యూహాలు రచిస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్..
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు భాజపాలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో కీలకనేతలు ఎవరెవరు చేరుతారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కమలనాథుల వ్యూహాలు ఫలిస్తే 2020 చివరినాటికి భాజపా బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో తెరాసను దీటుగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చూడండి: ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త