భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. పార్టీ సీనియర్ నేత ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ మృతి పట్ల భాజపా మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్ర వాయిదా వేసినట్టు బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ ప్రత్యేకంగా భేటీ అయి ఈ విషయంపై చర్చించారు.
ఈనెల 24 నుంచి తాను చేపట్టాలనుకున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 28కి వాయిదా వేసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp State President Bandi Sanjay) వెల్లడించారు. భాజపా సినీయర్ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (Up Ex Cm Kalyan Singh) మృతి నేపథ్యంలో పార్టీ పరంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే ఈనెల 24 నుంచి చేపట్టాల్సిన పాదయాత్రను కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
ఈనెల 28న ఉదయం 9.30 గం.కు బండి సంజయ్ యాత్ర ప్రారంభంకానుంది. హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. కల్యాణ్ సింగ్ మృతి నేపథ్యంలో పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ సైనికులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశామన్నారు. అంతకు ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ సైనికులు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కల్యాణ్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణ్ సింగ్ స్ఫూర్తితో రాష్ట్రంలో భాజపాను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: BJP: 24 నుంచి సంజయ్ పాదయాత్ర.. ఓల్డ్‌సిటీ నుంచే ప్రారంభం