BJP Task Force Committee Meeting on TSPSC: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీపై పార్టీ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైంది. దీనికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగా జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్.. ఆ తరువాత హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్ చేయాలనే ఆలోచన చేశారు.
ప్రధానంగా మూడు డిమాండ్లపై చర్చ: ఈ సమావేశంలో ప్రధానంగా మూడు డిమాండ్లపై బీజేపీ నేతలు చర్చించారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని పేర్కొన్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చెల్లించాలని వారు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ప్రధాని సభ, నరేంద్రమోదీ కామెంట్స్‌పై చర్చించారు. బీఆర్ఎస్ చేసిన విమర్శలు.. అందుకు సంజయ్ ఇచ్చిన కౌంటర్‌పై చర్చలు జరిపారు.
ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కోసం తాను తీసుకొచ్చిన శాలువాను బండి సంజయ్ అక్కడి వారికి చూపించారు. నిజంగానే ముఖ్యమంత్రి సభకు వస్తారని అనుకున్నానని.. అందుకే ఆయనకు స్వాగతం పలికేందుకు శాలువా తెచ్చానని వివరించారు. కానీ కేసీఆర్ రాలేదని బండి పేర్కొన్నారు. అంతకు ముందు ఆలె నరేంద్ర వర్థంతి సందర్భంగా బండి సంజయ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
పాతబస్తీ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి: పాతబస్తీ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి నరేంద్ర అని బండి సంజయ్ కొనియాడారు. బీజేపీ నేతలందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. భాగ్యనగరంలో హిందువులు ప్రశాంతంగా ఉన్నారంటే ఆయన గొప్పతనమేనని వివరించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆకాంక్షించిన వ్యక్తి అని అన్నారు. నరేంద్ర లాంటి వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని బండి సంజయ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భిద్దితోనే ప్రధాని మోదీకి స్వాగతం పలుకలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆక్షేపించారు. కనీసం అభివృద్ది పనుల్లోనూ పాల్గొనలేదని మండిపడ్డారు. మమత బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్,జగన్‌లు ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. అభివృద్ది పనుల ప్రారంభోత్సవాల్లో భాగస్వాములవుతున్నారని తెలిపారు. వీరిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. మోదీ సభానంతరం బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారే కానీ.. కల్వకుంట్ల కుటుంబం ఎక్కడా ఆయనను విమర్శించే ధైర్యం చేయలేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
ఇవీ చదవండి: కేసీఆర్ వస్తే సన్మానిద్దామని శాలువా కూడా తెచ్చా.. కానీ రాలే: బండి సంజయ్
'హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని అడ్డుకున్న వ్యక్తి ఆలె నరేంద్ర'
టికెట్ కౌంటర్ మహారాష్ట్రలో.. స్టేషన్ మాస్టర్ గుజరాత్లో.. ఈ రైల్వే స్టేషన్ ఎంతో స్పెషల్ గురూ!