స్లాబ్‌ల విధానంలో అధికంగా వస్తున్న కరెంట్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని విద్యుత్ సౌద, అదే విధంగా జిల్లా కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అధిక విద్యుత్ బిల్లుల భారం వేయడం తగదని ప్రేమేందర్ తెలిపారు. వేలాది మంది వినియోగదారులు తప్పుడు బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ.... బిల్లులు సరిగానే వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోందని ప్రేమేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలపై అధిక భారం పడుతున్న విద్యుత్ బిల్లులను రద్దు చేసే వరకు భాజపా పేద ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన హెచ్చరించారు.