కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా వ్యతిరేకిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా.. లేక ఓవైసీ మెప్పు కోసం అమలుకు సాధ్యంకాని దాని మీద కేబినెట్ నిర్ణయం తీసుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత వివక్షకు గురైన వారి కోసమే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. శరణార్థులకు భద్రత కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశ్యమన్నారు. ప్రేమ ఉంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఎన్పీఆర్ను రాష్ట్రంలో అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంఐఎం నాయకులను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని.. కానీ ఎంఐఎం నాయకులు కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరిచారని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ దుకాణం బందయ్యే పార్టీ అని.. ఆ పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
ఇవీ చూడండి:ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్ సహా విద్యార్థుల అరెస్ట్