BANDI SANJAY ON CM KCR: భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రగతి భవన్ కిందికి నీళ్లు వచ్చినా సీఎం బయటకురారని ఎద్ధేవా చేశారు. ఏ ఒక్క వరద ప్రాంతంలోనైనా ముఖ్యమంత్రి సందర్శిస్తే ప్రజలు భరోసా కలిగేదన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పలువురు భాజపా కండువా కప్పుకున్నారు.
రైతులు పంటలు వేసుకుంటున్న సమయం ఇది. రుణమాఫీ చేయలేదు.. రూ.8వేల కోట్ల రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తారని రైతులు ఎదురు చూశారు. రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. బ్యాంకుల్లో రైతులు డబ్బులు వేసుకునే పరిస్థితి లేదు. రూ.10వేల రైతుబంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు ఎత్తివేశారు. రైతులకు రుణమాఫీ తక్షణమే చేయాలి.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో రూ.10 వేల రైతు బంధు ఇచ్చి సబ్సిడీలన్నీ ఎత్తివేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు. రైతులకు లక్ష రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. 2018లో 6 శాతం ఉన్న భాజపా 30 శాతానికి పెరగడం మాములు విషయం కాదన్నారు. కుటుంబ పాలనపై కొట్లాడుతున్న భాజపాపై ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. వారం రోజుల్లో 8 శాతం కాదు అవసరమైతే 15 శాతానికి పెరుగుతామని స్పష్టం చేశారు. రాష్ర్టపతి ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. భాజపా ఎదుగుదలను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌కు సహాకారం అందిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్,తెరాస,కమ్యూనిస్టులు ఏకమైన భాజపా ఎదుగుదలను ఆపలేరన్నారు. భాజపా కార్యక్రమాల రోజే కాంగ్రెస్ పోటీగా కార్యక్రమాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు