పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) మండి పడ్డారు. పాతబస్తీ వదిలివెళ్లిన హిందువులంతా ధైర్యంగా తిరిగిరావాలని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన అందరికీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. మాయమాటలతో మభ్యపెడుతూ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారని పేర్కొన్న బండి సంజయ్.. అమరుల ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా ఒక్క కుటుంబమే పాలిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని బండి సంజయ్ దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి హామీని నెరవేర్చలేదని.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.
రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. పాతబస్తీ మాది... తెలంగాణ మాది. తాలిబన్ భావజాలం ఉన్న పార్టీ ఎంఐఎం. ఎంఐఎంను, వారికి సహకరిస్తున్న వారిని తరిమికొట్టాలి. ఇస్లాం, క్రైస్తవ మతాలకు భాజపా వ్యతిరేకం కాదు. హిందూ ధర్మానికి అడ్డొస్తే ఉపేక్షించం. బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దళిత బంధు పేరిట దళితులను వంచించే కార్యక్రమం కేసీఆర్ చేపట్టారని బండి సంజయ్ ఆరోపించారు. 27 మంది బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత భాజపాదేనని స్పష్టం చేశారు. బీసీలను కూడా చీల్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారని.. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేకపోయారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: Bandi Sanjay: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పూజలు