Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దగాపడ్డ తెలంగాణ ప్రజాలారా.. మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహా కుట్ర జరుగుతోందని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. ఈసారి మోసపోతే గోసపడతాం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతో పాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమ్మకం సడలిందనడానికి.. కేసీఆర్‌కి రాసిన లేఖనే ఉదాహరణ అన్నారు.
Bandi Sanjay Open Letter to CM KCR: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తున్నా దారి మళ్లిస్తూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తిరిగి కేంద్రంపై బురదచల్లే కుట్రలకు కేసీఆర్ తెరదీశారని సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
పంట నష్టపోయిన రైతులందరికీ ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందిస్తామన్నారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని కూడా అందిస్తామని బండి సంజయ్ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహరంలో సిట్ నోటీసుల జారీ పేరుతో.. ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కేసే కుట్రకు సీఎం కేసీఆర్ తెరదీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కుట్రకు కారణమైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సిట్ నోటీసులు, విచారణకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను దాడులు, నిషేధం పేరుతో ప్రశ్నించే మీడియా సంస్థల గొంతును అణిచివేసే కుట్ర జరుగుతోందని బండి సంజయ్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
కేటీఆర్ నాపై ఆరోపణలు చేశారు: సంజయ్: ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారని అదే నిజమైతే సిట్‌కు నిబద్ధత ఉంటే ప్రశ్నపత్రం లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నాపై ఆరోపణలు చేశారన్నారు. తనపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేటీఆర్‌కి నోటీసులు జారీ చేసే దమ్ము సిట్‌కు ఉందా అని ప్రశ్నించారు. సిట్‌కు కేటీఆర్‌ను పిలిచి విచారించే ధైర్యముందా అని నిలదీశారు.
సిట్ దోషులను శిక్షిస్తుందనే నమ్మకం కోల్పోయింది: సిట్ కేసీఆర్ జేబు సంస్థగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ పనిచేస్తుందని ఆరోపించారు. నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి.. దోషులను శిక్ష పడేలా చేస్తుందనే నమ్మకాన్ని సిట్ ఎప్పుడో కోల్పోయిందని తెలిపారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే, చివరకు తన కుమారుడు, బిడ్డ ఉన్నా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికి ముందే కేటీఆర్‌కి నోటీసులు ఇప్పించాలన్నారు.
ఇవీ చదవండి: