Bandi Sanjay On Crop MSP: రైతుల ఆదాయం పెరిగేలా కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను భారీగా పెంచడం సంతోషదాయకమన్నారు. వరి మద్దతు విషయంలో కేంద్ర కేబినెట్ మరింత ఉదారంగా వ్యవహరించిందని ఆయన కొనియాడారు. గతంలో క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1,940 ఉంటే ఇప్పుడు రూ.2,040కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2,060 ధర నిర్ణయించడంతో రైతులకు మరింత ఆనందం కలిగిస్తోందన్నారు. 2022-23 ఏడాదికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ఆమోదం తెలిపింది.
ఈ భేటీలో 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం బండి సంజయ్ తెలిపారు. ఏ గ్రేడ్ రకం వరి మద్దతు ధర క్వింటాల్‌కు 1,960 రూపాయల నుంచి 2,060 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. పత్తి మద్దతు ధరను రూ.5,726 నుంచి రూ.6,080కు.. పొడవు పత్తి రకానికి రూ.6,025 నుంచి రూ.6,380కు పెంచింది. కందులపై క్వింటాల్‌కు మద్దతు ధర రూ.300, పెసర్లకు రూ.400, పొద్దు తిరుగుడుపై రూ.385, సోయాబీన్‌పై రూ.300, నువ్వులపై రూ.523 పెంచింది. దీంతో పాటు కందులకు రూ.6,600, పెసర్లకు రూ.7,755, మినుములకు రూ.6,600, వేరుశనగ రూ.5,850 చెల్లించనున్నారు.
కేంద్రం ఇచ్చిన మద్దతు ధరలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. అందుకోసం అవసరమైన అన్ని సహాయకచర్యలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఎరువులను అందుబాటులో ఉంచేలా కేంద్రం సబ్సిడీని పెంచిందని బండి సంజయ్ వివరించారు.
ఇవీ చదవండి:
Covid Cases Raise: మళ్లీ పెరుగుతున్న కేసులు.. నాలుగో వేవ్‌కు సంకేతమా!