Bandi sanjay Fires on KCR: ప్రభుత్వ ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ రోజున సెలవు ఇవ్వకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగకు సెలవు ఇవ్వకుండా కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతటి విశిష్టమైన బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలని బండి సంజయ్ అన్నారు.
అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా? వేరే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వని కేసీఆర్.. ఓ మూర్ఖుడని దుయ్యబట్టారు. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు విధులను బహిష్కరించాలని బండి సంజయ్ సూచించారు.
సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు: ఈ క్రమంలోనే బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ప్రేమించే మహిళలు పూలను పూజిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మగా పేర్కొన్నారు. విజయదశమిని స్వాగతిస్తూ ముగిసే సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలియజేశారు.
ఇవీ చదవండి: కేసీఆర్ జాతీయ పార్టీకి కుదిరిన ముహూర్తం.. ఆ పేరు వైపు మొగ్గు
'ఖర్గేతో మార్పు సాధ్యం కాదు'.. ముఖాముఖి చర్చకు శశిథరూర్ డిమాండ్!