ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాలు పరీక్షలు చేస్తున్నా.. రాష్ట్రంలో జరగడం లేదన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులకు నిర్వహించిన హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరించి అపవాదు మూటగట్టుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సార్లు కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని తాము విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కొవిడ్ వచ్చిన పేద ప్రజలకు చికిత్స దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని.. కరోనా లక్షణాలున్నా.. అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్కార్ కేసుల సంఖ్య పెరగకూడదని భావిస్తోందన్న ఆయన పరీక్షలు విస్తృతంగా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గాంధీలో వైద్యులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని.. అక్కడ వైద్యులకు సరైన సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విషయానికి సీఎం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో.. వైద్యులు ఏలా పని చేస్తారో.. ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు ఆరోగ్యశాఖ మంత్రికి ఆరోగ్యశాఖపైనే నియంత్రణ లేదని ఆరోపించారు. రోజువారీగా విడుదల చేస్తున్న హెల్త్ బులెటెన్లలోని లెక్కల్లో వ్యత్యాసం ఉండడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'