575 టీఎంసీల కృష్ణా జలాల వాటాను కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తాను చెప్పిందే ఇప్పుడు రుజువైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 299 టీఎంసీలకు కేసీఆర్ పెట్టిన సంతకాన్ని జగన్ ఉటంకిస్తూ... తెలంగాణ వాటా 299 టీఎంసీలు మాత్రమేనని ఏపీ అపెక్స్ కౌన్సిల్‌లో వాదించిందని తెలిపారు.
ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు..!
ఇప్పుడు కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ఘాటుగా ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వాటాను అడగకుండా... కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన కేసీఆర్ అతిపెద్ద తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు.
కేసీఆర్‌ను చరిత్ర క్షమించదన్నారు. కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించడానికే కేసీఆర్, జగన్‌లు ఒక్కటి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కుమ్మక్కయ్యారని అపెక్స్ కౌన్సిల్‌లో తేలిందని తెలిపారు.