రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి తప్పితే వాటిని అమ్మే అధికారం ఉండదని సూచించారు. ఈ భూమి మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ప్రజల సౌకర్యార్థం ఉపయోగించాలే తప్ప అమ్మడం అనేది అనైతికమన్నారు. హైదరాబాద్, ఇతర నగరాల చుట్టూ ఉన్న విలువైన భూములను అమ్మాలని నిర్ణయించడం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచడమేనని మండిపడ్డారు. ఇప్పటికే పలు ప్రభుత్వ, అసైన్డ్, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్, భూసంస్కరణల మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
భూములు అమ్మితే కానీ...
భూమి అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూగా మార్చుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. 2014లో రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... భూములు అమ్మితే కానీ పొద్దుగడవని స్థాయికి దిగజార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని విమర్శించారు. హెచ్ఎండీఏ, హౌజింగ్ బోర్డ్, దిల్, టీఎస్ఐఐసీ, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, నీటిపారుదల, పరిశ్రమల శాఖల సంస్థల ఆధ్వర్యంలో వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని.. అవి అన్యాక్రాంతం కాకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
అమ్మకం ఆపాలి...
గతంలో తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ భూములు వేలం వేయడాన్ని భాజపా (Bjp) వ్యతిరేకించిందని గుర్తు చేశారు. తెదేపా, కాంగ్రెస్లో ఉన్న భూమాఫియా మొత్తం తెరాసలో నాయకులుగా చెలామణి అవుతుందని దుయ్యబట్టారు. వారి కబ్జాలో ఉన్న భూమిని చట్టపరంగా విడిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపి, రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే భాజపా ప్రజా, రాజకీయ ఉద్యమాన్ని తీసుకురావడమే కాకుండా న్యాయ పోరాటం చేస్తోందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మోదీ కోసం చెక్కతో 'హనుమాన్ చాలీసా'!