రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తుండడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. తాను చెప్పిన పంటనే సాగుచేయాలంటూ సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని అగాథంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు విషయంలో గందరగోళానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భూమిలో ఏ పంట పండించాలో చెప్పకుండా మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో ఉంటూ హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ మాట నమ్మి సన్నరకం వరిసాగు చేసిన రైతులు నష్టపోయారని... దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు లాభాలు గడిస్తుంటే రైతులు ఎందుకు నష్టపోతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న అన్నదాతల పక్షాన నిలబడి మాట్లాడితే కేసీఆర్‌కు చిల్లర రాజకీయాల్లాగా కనిపిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు గతంలో ప్రకటించారని...కేసీఆర్ లాగా కోట్లు సంపాదించే టెక్నిక్ తెలియకపోవడం వల్ల రైతులు చిల్లర మనుషుల్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: 'మక్కల కొనుగోలు, ఉద్యోగులకు డీఏ ప్రకటన ప్రజల విజయం'