రాష్ట్రంలో సీఎం కేసీఆర్... వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ విద్యుత్ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కావాలనే అధికంగా విద్యుత్ బిల్లులు వేస్తున్నారన్న బండి సంజయ్... అధిక విద్యుత్ బిల్లులతో పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
కరోనా ఖర్చుల కింద కేంద్రం వేల కోట్ల నిధులు ఇచ్చిందని... ఆ నిధులను వైరస్ కట్టడి కోసం ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. భాజపా నేతలను ఎక్కడిక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిరోజు అరెస్టు చేసినా మేం ఆందోళన చేస్తామని.. వెనక్కి తగ్గమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన చేస్తామని ఉద్ఘాటించారు. విద్యుత్ బిల్లులన్నీ ప్రభుత్వమే చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
" ఒక ప్లాన్ ప్రకారం ఈ ముఖ్యమంత్రి ఒక వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నాడు. ప్రైవేటు ఫైనాన్స్ యజమానిలా వ్యవహరిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్లను అక్రమ స్లాబుల ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని చూస్తున్నాడు. కరోనా ఖర్చుల కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తే... ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. విద్యుత్ బిల్లులన్నీ ప్రభుత్వమే కట్టాలి."
---- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి: లక్ష్మణ్ అరెస్ట్.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం