Bandi sanjay comments on cm kcr ఏ స్కామ్‌ల్లో అయినా కేసీఆర్ కుటుంబీకులు ఉంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా సమావేశాలతో కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాసలో డబ్బులు లేవని పనులు జరగట్లేదని బండి సంజయ్ అన్నారు. సమాజానికి సేవచేసే వారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై చీత్కారానికి కారణం సీఎం కేసీఆరేనని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదని మండిపడ్డారు. భాజపా ఇచ్చిన హామీల్లో ఆర్టికల్ 370ను భాజపా రద్దు చేసిందని గుర్తు చేశారు. మనం రాష్ట్రంలో ఉన్నామా? నైజాం పాలనలో ఉన్నామా అనేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు.
సీఎస్‌కు బండి సంజయ్ లేఖ: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు తమ బృందానికి అనుమతి ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం, వరదల్లో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామని సీఎస్‌కు లేఖ రాశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ ప్రజా ప్రతినిధులు, నీటిపారుదలశాఖ నిపుణులతో కూడిన 30మంది సభ్యుల భాజపా బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్ మొదటి వారంలో సందర్శిస్తుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. భారీ వరదలతో మోటార్లకు ఏర్పడిన నష్టాన్ని తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని వెల్లడించారు. 1998లో వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌లు దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయిని గుర్తు చేశారు. 2004-2009లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని లేఖలో వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇరిగేషన్ అధికారులను పంపి సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ సూచించారు.
ఇవీ చదవండి: